Wednesday, August 8, 2012

లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి రామకృష్ణ

లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి రామకృష్ణ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 16: ప్రముఖ చిత్రకారుడు, గుంటుపల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో పనిచేసే చిత్రకళా ఉపాధ్యాయుడు ఎ రామకృష్ణ పేరు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంస్థ బెంగుళూరులో 2010 మే 20న చిత్రకళా పోటీలను జాతీయ స్థాయిలో నిర్వహించింది. ఈ పోటీల్లో పాల్గొన్న రామకృష్ణ కేవలం 13గంటల వ్యవధిలో 100 తైలవర్ణ చిత్రాలను చేతివేళ్లతో గీసి రికార్డు సృష్టించారు. ఈసందర్భంగా తాజాగా వచ్చిన లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్ట్ఫికెట్‌ను రామకృష్ణకు బుధవారం పాఠశాలలో ఉపాధ్యాయుల సమక్షంలో ప్రిన్సిపాల్ టి అలివేణి అందజేశారు.

రాఖీతో రికార్డు

రాఖీతో గిన్నిస్ రికార్డు

భీమవరం, మార్చి 20: వారు చదువుతున్నది ఇంజనీరింగ్. పైగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి)లో విద్యనభ్యసిస్తున్నారు. వీరు స్థానిక ఎస్‌ఆర్‌కెఆర్ కళాశాలకు చెందిన విద్యార్థులు. అయితే వీరి ఆలోచన మాత్రం ఖండాంతరాలు దాటింది. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు అంతర్జాతీయస్థాయిలో ఎందుకు రాణించకూడదని ఆలోచన చేశారు. ముందుగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌ను టార్గెట్‌చేశారు. సునాయాసంగా దానిని సాధించి విజయం సాధించారు. ఇప్పుడు గిన్నీస్ రికార్డుపై వారు కనే్నశారు. పచ్చనిచెట్లను రక్షించాలని, పర్యావరణాన్ని కాపాడాలని బాహ్య ప్రపంచానికి అర్ధమయ్యేలా సరికొత్త ఆలోచనలతో ముందుకు దూసుకుపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోని ఐటి విభాగాధిపతి డాక్టర్ పార్థసారధి వర్మ ఆధ్వర్యంలో పచ్చని ప్రకృతిని ప్రేమించాలంటూ కార్యక్రమాలను ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం వీరి ప్రత్యేకత. కాగా గతంలో 10 అడుగుల రాఖీని చెట్టుకు కట్టి కొందరు గిన్నీస్ రికార్డును నెలకొల్పారు. ఇప్పుడు ఆ గిన్నీస్ రికార్డును ఎస్‌ఆర్‌కెఆర్ ఐటి విభాగ విద్యార్థులు అధిగమించనున్నారు. 12 అడుగుల రాఖీని తయారుచేసి చెట్టుకు కట్టి రికార్డును నెలకొల్పనున్నారు. ఈ కార్యక్రమాన్ని మార్చి 22వ తేదీన కళాశాల ఆవరణలో ప్రదర్శించనున్నారు. అలాగే నేలపై 25 అడుగుల రాఖీని తయారుచేసి 50 అడుగుల తాడును ఏర్పాటు చేయడం గిన్నీస్‌బుక్‌లో చోటుచేసుకున్న మరోరికార్డు. ఈ రికార్డును ఇదే విభాగానికి చెందిన విద్యార్థులు 30 అడుగుల వెడల్పుతో రాఖీ తయారుచేసి, ఈ రాఖీకి ఇరువైపులా 60 అడుగుల తాడును సిద్ధం చేసి ఈ రికార్డును కూడా నమోదు చేసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కళాశాల పాలకవర్గం మంగళవారం విడుదల చేసింది. మార్చి 22వ తేదీన జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమానికి పట్టణవాసులంతా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. పచ్చని చెట్లను కాపాడాలని 3సేవ్ ట్రీ2 అనే నినాదంతో ప్రజల ముందుకెళ్ళనున్నామని కళాశాల పాలకవర్గ అధ్యక్షులు సాగి ప్రసాదరాజు, ఛైర్మన్ గోకరాజు మురళీరంగరాజు, డైరెక్టర్ సాగి రంగరాజు, ప్రిన్సిపాల్ డి రంగరాజు పిలుపునిచ్చారు. విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి తదితరులు పాల్గొన్నారు.